అబిడ్స్/ సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 25: అభివృద్ధిని పట్టించుకోకుండా మతం పేరుతో రాజకీయం చేస్తున్న వారికి రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ నందకిశోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో నిర్వహించిన నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
నగర మంతటా అభివృద్ధి జరుగుతుంటే గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అధికంగా ఉన్నారని, వారు వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి వేధింపులు లేకుండా పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరోనా సమయంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయల వ్యయంతో సరుకులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భవన నిర్మాణ దారులను వేధిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా పని చేస్తే సాధించనిదంటూ ఏమీ లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పోరాటం చేసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, సీనియర్ నాయకులు ఆర్వీ మహేందర్ కుమార్, మాజీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్త, ముఖేష్‌సింగ్, రాంచందర్‌రాజు, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.