Vikrant Massey | ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే కీలక పాత్ర పోషిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టాడు విక్రాంత్. తాను ఈ సినిమాలో తాను భాగం కాదని, అసలు ఈ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విక్రాంత్ తెలిపాడు. ఈ చిత్రంలో రావణుడి కుమారుడైన ‘మేఘనాథుడి’ (ఇంద్రజిత్తు) పాత్ర కోసం విక్రాంత్‌ను తీసుకున్నారని, కాల్షీట్ల సమస్య వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంలో రాఘవ్ జుయల్ వచ్చారని ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విక్రాంత్, తాను ఎప్పుడూ ఆ సినిమాలో లేనని, ఇప్పుడు కూడా లేనని ఘాటుగా సమాధానమిచ్చారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ‘రామాయణ’ పార్ట్-2లో మేఘనాథుడి పాత్రను రాఘవ్ జుయల్ పోషించే అవకాశం కనిపిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాను ఈ సినిమాలో నటించకపోయినా, ఒక ప్రేక్షకుడిగా థియేటర్లో సినిమా చూస్తానని చెబుతూ చిత్ర యూనిట్‌కు విక్రాంత్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. విక్రాంత్ లాంటి వెర్సటైల్ నటుడు ఈ సినిమాలో ఉంటే బాగుంటుందని భావించిన అభిమానులకు ఆయన ఇచ్చిన ఈ క్లారిటీ కాస్త నిరాశ కలిగించే విషయమే అని చెప్పాలి.