బేగంపేట్, జూన్ 30: జూలై 9వ తేదీన జరగనున్న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఈవో మనోహార్‌రెడ్డి, ఆధ్వర్యంలో మహంకాళి ఆలయ పాలకమండలి సభ్యులు మంత్రి తలసాని దంపతులకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని వారి నివాసంలో బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే మహిళలు, లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయ పాలక మండలి సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకోని ఏర్పాట్లును పర్యవేక్షంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఆలయ ఫౌండర్ చైర్మన్ రమేశ్, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రేవ్‌యార్డ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితం ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఓల్డ్ కసమ్స్ బస్తీలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడి బస్తీ వాసులంతా అప్పటి ఖబరస్థాన్ కమిటీ అధ్యక్షుడైన సలీంఖాన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి బేగంపేట్ ముస్లిం అంత్యక్రియలు చేయాలంటే స్థలం లేదని ‘గ్రేవ్ యార్డ్’ కోసం స్థలం కేటాయించాలని వారి ఇబ్బందులను వివరించారు. దీంతో స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకోని గ్రేవ్ యార్డ్ కోసం ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో రెండు ఎకరాల స్థలా న్ని సాధించిపెట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తూ.. మంత్రులు కేటీఆర్, తలసానిలకు కృతజ్ఞతలు తెలిపారు.