బేగంపేట్ అక్టోబర్ 21: శీనన్న ఈ సారి కూడా నువ్వే గెలుస్తావ్.. నీకే మా ఓటు అంటూ పలువురు ఓటర్లు మంత్రి తలసానిని ఆశీర్వదించారు. శనివారం బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఓటర్లు మంగళహారతులిచ్చి, బొట్టు పెట్టి దీవించారు. అనంతరం సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరం కొనసాగుతాయన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే వరద నీటితో బేగంపేట్ నాలా పరిసర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. వారి సమస్యను సుమారు 45 ఏండ్ల పాటు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు కానీ, నాటి ప్రభుత్వాలు కాని పట్టించుకోలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.45 కోట్ల వ్యయంతో నాలా పూర్థిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టి ఏండ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని స్థానిక ముస్లింలు 30 సంవత్సరాల నుంచి కోరుతున్నా… గత ప్రభుత్వాలు నెరవేర్చలేక పోయాయని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.3 కోట్ల రూపాయలతో ఖబరస్థాన్ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. మంత్రి తనయుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ కూడా పాల్గొని బేగంపేట్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ఓటర్లకు వివరించారు.