సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మూడు, నాలుగు విడుతలకు సంబంధించిన 39,804 డబుల్ బెడ్ ఇండ్లను ఆన్లైన్ లాటరీ, ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజక వర్గాలలో మూడో విడుత ద్వారా 36,884 ఇండ్ల కేటాయించామన్నారు. వాటిలో వికలాంగులకు 1843, ఎస్సీలకు 6271, ఎస్టీలకు 2215, ఇతరులకు 26,555 ఇండ్లు కేటాయించామన్నారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన ప్రాంతాలకు సంబంధించిన స్థానికులకు అదనంగా మరో 2920 ఇండ్లను కేటాయించామన్నారు. పేదలకు లాటరీ ద్వారా కేటాయించిన ఇండ్లను అక్టోబర్ 2, 5న రెండు విడుతలలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్ఐసీ సాఫ్ట్వేర్ సహకారంతో లాటరీ తీయడం, అలాగే ర్యాండమైజేషన్ విధానం ద్వారా రిజర్వేషన్లు అమలు చేశామన్నారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో కేవలం 30 శాతం రాయితీతోనే ఇండ్ల ఇచ్చే వారని, దాని వల్ల పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఒక్క రూపాయి చెల్లించకుండా వంద శాతం రాయితీతో రూ.8.60 లక్షలతో ఇళ్లను నిర్మించి ఇచ్చామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ.9600 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంద శాతం రాయితీతో కేటాయించడం భారత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్ల కేటాయింపు ఇవ్వడం వల్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ మీర్జా రహమెత్బేగ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, అరెకపుడి గాంధీ, సుధీర్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ మధుసూదన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, డీఆర్వో వెంకటాచారి, ఎన్ఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.