సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)/ బేగంపేట్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లు చేశాం.. ఎక్కడా లోటు లేకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. మంగళవారం బుద్ధ భవన్లో ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వాటర్ వర్స్ ఈఎన్సీ కృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్, ఆర్అండ్బీ ఎస్ఈ అజ్మతుల్లా, ఏసీపీలు, సీఐలు, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ కమిటీ చైర్మన్ జయరాజ్, సికింద్రాబాద్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు శీలం ప్రభాకర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో నిర్వహించే గణేశ్ ఉత్సవాలకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 35 వేలకుపైగా విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం ఉందన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేరొన్నారు. సెప్టెంబర్ 9న పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఊరేగింపు నిర్వహించే రహదారులపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వాటర్ వర్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రౌండ్ ది క్లాక్ పద్ధతిలో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎప్పటికప్పుడు ఊరేగింపు జరిగే రహదారులు, నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తారని పేరొన్నారు.
పండుగలు గొప్పగా..
పండుగలు గొప్పగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని వివరించారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా 6 లక్షల గణపతి మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భాగ్యనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా అధికారులకు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.