బేగంపేట్ ఆగస్టు 2: 1934లో ఏర్పడిన జీరా కాలనీవాసుల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో సాకారం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని జీరా కాలనీలో లీజు ల్యాండ్‌లో ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న 134 ఇండ్ల స్థలాలను ఫ్రీ హోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని కాలనీవాసులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జీరా కాలనీ స్థలాలను ఫ్రీ హోల్డ్ చేయాలనే ఎన్నో సంవత్సరాల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జీరా కాలనీ వాసుల సమస్యను అర్థం చేసుకుని పెద్ద మనసుతో జీవో 816 ప్రకారం ఫ్రీ హోల్డ్ చేసేందుకు అంగీకరించారని అన్నారు. 38 సంవత్సరాల తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సమస్య పరిష్కారం అయిందని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కాలనీవాసులు మిఠాయిలు పంచుకుని, పటాకులు కాల్చారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జీరా కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షుడు విజయ్‌షా తదితరులు పాల్గొన్నారు.