హైదరాబాద్: హైదరాబాద్‌లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీతో (SNDP) నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని పికెట్ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నాలాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో డెవలప్మెంట్ పనులు చేస్తున్నామన్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
పికెట్ నాలా పై బ్రిడ్జి నిర్మాణంతో పరిసరాల్లోని 100 బస్తీల ప్రజలకు వరద నుంచి విముక్తి లభిస్తుందని చెప్పారు. ఆసియాలొనే అతిపెద్ద స్లమ్‌గా పేరుగాంచిన రసూల్‌పురా బస్తీ కూడా ఈ నాలా పరిధిలోనే ఉందని వెల్లడించారు. వీలైనంత తొందరగా నాలా పనులు పూర్తిచేస్తామని, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.