హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దళితబంధు పథకం అమలు తీరుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన దళితులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దరఖాస్తు చేసుకోగా.., 1462 మంది ఖాతాలలో 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు వివరించారు. వీరిలో 1200 మంది లబ్ధిదారులకు వారు కోరుకున్న యూనిట్లను అందజేశామన్నారు. మిగిలిన లబ్ధిదారులకు ఈ నెలాఖరు లోగా యూనిట్లను సంబంధిత ఎమ్మెల్యేల సహకారంతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దళితబందు కింద ఎంపికై ఆర్ధిక సహాయం పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా మరింత చేయూతను అందించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హులైన దళితులు అందరికి దశల వారీగా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, సాయన్న, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్ పాల్గొన్నారు.