హైదరాబాద్: హైదరాబాద్లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ముక్కోటి ఏకాదశి వేడుకలలో భాగంగా జియాగూడలోని రంగనాథ స్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి తరహాలోనే రకరకాల దేశీయ, విదేశీ సుగంధ పుష్పాలు, రంగురంగుల విద్యుత్తు దీపాలంకరణతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. శ్రీరంగనాథుడు వైకుంఠనాథుడి రూపంలో గరుడవాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 6న నమ్మాళ్వార్ పరమపద ఉత్సవం, 14న సాయంత్రం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథుడి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.