హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున్న 296 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి భూమిపూజ నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పేదలు సకల సౌకర్యాలు కలిగిన సొంత ఇంట్లో సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. అందుకోసమే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే పలు చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామన్నారు.
ఇండ్లు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మీ వద్దకు వస్తారని, వారిని నమ్మి మోసపోవద్దన్నారు.
అర్హులైన అందరికి పారదర్శకంగా ఇండ్లను కేటాయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, కలెక్టర్ శర్మన్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, డీఈ గంగాధర్, తహసీల్దార్ బాల శంకర్తదితరులు పాల్గొన్నారు.