సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్లో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌తో కలిసి హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా అనేక నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి సమ్మేళనాలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. మిగిలిన డివిజన్లలో కూడా ఈనెల 24వ తేదీ లోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి తలసాని సూచించారు.
ఈ నెల 25వ తేదీన నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారిని, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆహ్వానించాలని వివరించారు. అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిషరించి సమావేశం వద్దకు రావాలని చెప్పారు. సమ్మేళనాల సందర్భంగా జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులను తెలియజెప్పేలా ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆనంద్ గౌడ్, నందు బిలాల్, ఆజాం, సలాఉద్దిన్ లోది, రాంరెడ్డి, జీవన్ సింగ్, బక్రీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. ఈ నెల 25న బీఆర్ఎస్ జెండాలను మున్సిపాలిటీలు, డివిజన్లు, గ్రామగ్రామాన ఎగుర వేయాలని ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలను బోయిన్‌పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మంత్రి కోరారు. జెండాలు ఎగురవేసిన అనంతరం భారీఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.