Minister Talasani | హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రస్తుత పరిస్థితులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి తలసాని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని.. నీటి లెవల్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడదుల జరుగుతున్నందున లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్ని స్థాయిల్లోని అధికారులను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలని ఆదేశించారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నది. పౌరులు అందిం చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా నీటి తొలగింపునకు 157 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాల తొలగింపు పనులు చేపడుతున్నాయి. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక డీఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను వెను వెంటనే తొలగిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తున్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తుగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రోనాల్డ్‌రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు. కాగా గురువారం సాయంత్రం 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, 15 ప్రాంతాల్లో వాటర్ నిలువగా, మరో రెండు చోట్ల గోడ కూలిన ఘటనల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. వర్షాలతో రోడ్డుపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో ఈవీడీఎం బృందాలు మోహరించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. కాగా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులకు సూచించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, పలు అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.