హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ప్రాంతంలో మైనార్టీలకు ఖబరస్థాన్ ఏర్పాటుతో దశాబ్దాల కల నెరవేరిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శనివారం బేగంపేటలోని ఓల్ట్ కస్టమ్ బస్తీలో ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఖబరస్థాన్(Grave Yard) పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖబరస్థాన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసిందన్నారు. మనిషి మరణిస్తే ఖననం చేసేందుకు స్థలం లేకపోవడం అత్యంత దయనీయమన్నారు. ఖబరస్థాన్ లేకపోవడం వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలు (ఖననం) ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా స్థానికులు ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను ఖబరస్థాన్ కు స్థలం కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు.
ఇక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) ల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, బస్తీ వాసులు సలీం ఖాన్, అఖిల్, వాహిద్, నవాబ్, అబ్బాస్, ఆరీఫ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, నరేందర్ రావు, శేఖర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.