కవాడిగూడ, మే 16 : అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో మంగళవారం తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీఎం కేసీఆర్ ధన్యవాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును ప్రధాని మోదీ ఎందుకు పెట్టడం లేదని మంత్రి ప్రశ్నించారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి దళితబంధు తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ బీసీ జనగణన లెక్కలు ఎందుకు చేపట్టలేదన్నారు. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ పాలనను తరిమికొట్టారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు అండగా నిలిచి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను దేశ ప్రధానిని చేసేందుకు నడుం బిగించాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ ధన్యవాద సభలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యులు కిశోర్ గౌడ్, ఓరుగంటి ఆనంద్, నిర్వాహకులు గంధం రాములు, కోల శ్రీనివాస్, శేఖర్ సాగర్, పాండు, ముంజుల, పల్లవి సాగర్, బెల్లం మాధవి తదితరులు పాల్గొన్నారు.