బడంగ్‌పేట, ఏప్రిల్ 9: ప్రధాని మోదీ దేశ సంపదను దోచి అదానీ జేబులు నింపుతున్నాడు తప్పా తెలంగాణ రాష్ర్టానికి పైసా ఇవ్వడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మి గార్డెన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ కుటుంబంపై విషం కక్కడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ మంతా అమలు చేసి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. రైతు మరణిస్తే దినాలలోపే ఐదులక్షల బీమా ఇస్తున్నామన్నారు. రైతు బీమాను దేశ మంతా అమలు చేసి ఐదులక్షలు ఇవ్వాలన్నారు.
ప్రజల మధ్యన విద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. తుక్కుగూడకు ఎందుకు ఐటిఐఆర్ ఇవ్వలేదో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ వందల సార్లు ప్రధాన మంత్రిని కలిసి దండం పెట్టినా పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి గురించి కేసీఆర్ కుటుంబం పై విష ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండ్లు ఉండి కూడా తెలంగాణ అభివృద్ధి కన్పిస్తలేదంటే వారిని ఏమనాలో ప్రజలే చెప్పాలన్నారు. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రంలోని బీజేపీ నాయకులు ఎందకు తగ్గించడం లేదో ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇవ్వాలన్నదే ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. రావిర్యాలలో ఐటీఐఆర్ కంపెనీ ఎందుకు పెట్టలేదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ మరో ఐటెక్ సీటీగా మారబోతుందని విద్యాశాఖ మంత్రి తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఎల్ రమణ అన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడ అమలు అవుతున్నాయో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడి దారులకు ధారదత్తం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్, పెట్టుబడి సంస్థలకు దేశ సంపదను అప్పగిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచి రెడ్డి కిషన్ రెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ర్టానికి బీజేపీ, కాంగ్రెస్ పారీల్టు ఏం చేశాయో ఆయా పార్టీల నాయకులను ప్రజలు నిలదీయాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్స్ బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్, మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్ శర్మ, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.