సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కి బిల్లు లు మంజూరు కావాలంటే అక్కడ కప్పం కట్టాల్సిందే. ఒక్కో బిల్లుకు ఒక్కో రేటు.. కప్పం కట్టకపోతే బిల్లులు మంజూరు కావు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేసేది లేక కొందరు డిస్ట్రిబ్యూటర్లు మందులు, సర్జికల్స్ సరఫరాను నిలిపివేస్తారు.
నిబంధనల ప్రకారం మందులు సరఫరా చేసిన మూడు నెలల్లోపు సంబంధిత డిస్ట్రిబ్యూటర్స్‌కు బిల్లులు మంజూరు చేయాలి. అయితే పరిపాలనా, నిధుల లేమి తదితర కారణాల రీత్యా ఒకటి లేదా రెండు నెలలు అటూ ఇటూ కావచ్చు. అయితే బిల్లులు ప్రభుత్వం నుంచి మంజూరైనా వాటిని కొన్ని శక్తులు తొక్కిపెడతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి విడుదల కావాలంటే ఆ శక్తులకు కప్పం కట్టాల్సిందే. ఈ క్రమంలోనే ఎంఎన్‌జే దవాఖానకు ఔషధాలు, సర్జికల్ వస్తువులను సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్స్‌కి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా బిల్లులు విడుదల కాలేదు.
దీంతో గతంలో కొన్ని ఏజెన్సీలు మందుల సరఫరాను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంత కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్న డి్రస్ట్రిబ్యూటర్స్కి దవాఖాన డైరెక్టర్ కార్యాలయం నుంచి ఒక తీపి కబురు అందినట్లు తెలిసింది. ‘మీ బిల్లులను విడుదల చేస్తాం, వెంటనే ఫలానా వ్యక్తిని కలవండి’ అంటూ సమాచారం అందుకున్న డిస్ట్రిబ్యూటర్లలో చాలా మంది దవాఖానకు క్యూ కట్టినట్లు సమాచారం.
ఎంఎన్‌జేకు మందులు, ఇతరాత్ర సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు సంబంధించిన బిల్లులను విడుదల చేయించేందుకు ఓ మంత్రి పేషీకి చెందిన షాడో వ్యక్తి నేరుగా రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగా ఐదు రోజుల కిందట సదరు షాడో వ్యక్తి ఏకంగా ఎంఎన్‌జే దవాఖానకు చేరుకుని ఎన్ని కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? సంబంధిత డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? ఎంత మంది ఉన్నారు, కోట్లలో ఉన్న బిల్లులు ఎన్ని, లక్షల్లో ఉన్న బిల్లులు ఎన్ని తదితర అంశాలపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం.
బిల్లు ఆధారంగా కమీషన్లు చెల్లిస్తే వెంటనే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయిస్తానంటూ సదరు షాడో వ్యక్తి డైరెక్టరేట్‌లోని ఒక అధికారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు అధికారి విషయాన్ని అందరు డిస్ట్రిబ్యూటర్స్‌కు చేరవేయాల్సిందిగా తన సిబ్బంది ద్వారా కబురు పంపినట్లు కొందరు డిస్ట్రిబ్యూటర్లు బహిరంగంగానే చర్చించుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఏకం చేసి, కమీషన్ల ఒప్పందానికి ఒప్పించడంలో డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్‌కు చెందిన ఒక ప్రతినిధి కీలక పాత్ర పోషించినట్లు డిస్ట్రిబ్యూటర్స్ వర్గాల ద్వారా తెలిసింది.
బిల్లుల చెల్లింపులో కమీషన్లు చెల్లించేందుకు కొందరు డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఏజెన్సీ కమీషన్లు ఎందుకు చెల్లించాలని ఎంఎన్‌జే అధికారులను నిలదీసినట్లు సమాచారం. కోట్ల రూపాయల మందులు సరఫరా చేసిన తమకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, అది చాలక నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బిల్లులకు కమీషన్లు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కొందరు దవాఖాన సిబ్బంది, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌లోని కొందరు ప్రతినిధులు సదరు డిస్ట్రిబ్యూటర్‌కు నచ్చజెప్పడంతో గత్యంతరం లేక ఒప్పందానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఎంఎన్‌జే దవాఖానకు మందులు, సర్జికల్స్ తదితరాలను సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయించేందుకు ఓ మంత్రి పేషీకి చెందిన షాడో వ్యక్తి బిల్లుకో రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఔషధాలు సరఫరా చేసిన బిల్లులపై 3శాతం కమీషన్, సర్జికల్స్ సరఫరా చేసిన బిల్లులపై 4.5శాతం చొప్పున కమీషన్ చెల్లించాలని మంత్రి పేషీకి చెందిన షాడో వ్యక్తి, దవాఖాన డైరెక్టర్ కార్యాలయ వర్గాలకు సూచించినట్లు సమాచారం.
ఈ మేరకు డైరెక్టర్ కార్యాలయం నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కి పిలుపు వచ్చినట్లు సమాచారం. కోట్ల రూపాయల బిల్లులు ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వెంటనే సార్ పేషీకి వెళ్లి నిర్ణీత కమీషన్ చెల్లించి రావాలని సూచనలు అందడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్స్ పేషీలో షాడో వ్యక్తికి కప్పం కట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కప్పం కట్టిన డిస్ట్రిబ్యూటర్స్ సోమవారం ఎంఎన్జెకు తమ బిల్లులకు సంబంధించిన చెక్కుల కోసం వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఒక కీలక శాఖకు చెందిన మంత్రి పేషీలో పేరుమోసిన ఒక వ్యక్తి, ఆ మంత్రి షాడోగా అందరికీ సుపరిచితం. ఆ షాడో వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హోదా లేదు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తి. మంత్రితో సంబంధాలు ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. కారీ మంత్రి కుటుంబ సభ్యులతో అతడికి సన్నిహితం ఉన్నట్లు ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తి సదరు మంత్రి పేషీకి షాడోగా వ్యవహరిస్తూ చాలా రకాల కార్యాలను చక్కబెడుతుంటాడు. ఈ క్రమంలో ఈ షాడో వ్యక్తి చాలా మందికి సుపరిచితం. ఈ షాడో వ్యక్తికి ఎంఎన్జేలో పీజీ చేస్తున్న వ్యక్తికి దగ్గరి పరిచయం.
సచివాలయంలో చక్రం తిప్పాలనుకుని భంగపడిన సదరు వ్యక్తి పీజీగా చేరి మంత్రి పేషీకి షాడోగా ఉన్న వ్యక్తి ద్వారా తన కలలను సాకారం చేసుకుంటున్నట్లు దవాఖాన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సదరు పీజీ, దవాఖానకు అవసరమైన మందుల కొనుగోలు, సర్జికల్స్, ఇతరాత్రా వాటి కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతూ, వచ్చిన దాంట్లో అర్హులైన అధికారులకు పంపకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎంఎన్‌జేకు స్వయం ప్రతిపత్తి హోదా ఉండడంతో అక్కడ రోగులకు ఇవ్వాల్సిన మందులు, ఇతరాత్ర వాటిని టీఎస్ఎంఐడీసీ నుంచి కాకుండా నేరుగా కొంటారు. అయితే వాటికి కూడా కొన్ని కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి.
కానీ అన్ని అనుభవాలున్న వ్యక్తి చేతికి మట్టి అంటకుండా తనకు లాభం చేకూర్చే డిస్ట్రిబ్యూటర్స్, ఏజెన్సీలకే మందులు, సర్జికల్స్ వంటి వాటిని సరఫరా చేసే టెండర్లు దక్కెలా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంత్రి పేషిలోని షాడో వ్యక్తి ద్వారా డిస్ట్రిబ్యూటర్స్‌కు విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
రాజకీయ నేపథ్యం ఉన్న ఒక పీజీ వైద్య విద్యార్థి ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన పరిపాలనా వ్యవస్థలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడు. గత అనుభవాలు, పరిచయాలతో దవాఖాన పరిపాలనాధికారులను తన దారిలో పెట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. సచివాలయంలో చక్రం తిప్పాలనుకుని భంగపడిన సదరు వ్యక్తి, ఎంఎన్జేలో వైద్య విద్యార్థిగా చేరి తన కల నెరవేర్చుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య విద్యను అభ్యసిస్తూ, రోగులకు సేవలందించాల్సిన పీజీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా దవాఖాన పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చడమే కాకుండా అన్నింట్లో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దవాఖానకు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను ఆసరాగా చేసుకుని సదరు వ్యక్తి తనదైన శైలిలో అందినకాడికి దండుకుంటున్నట్లు దవాఖాన వర్గాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్ల బిల్లుల మంజూరులో కూడా సదరు పీజీనే షాడో వ్యక్తి ద్వారా కీలక పాత్ర పోషించినట్లు డిస్ట్రిబ్యూటర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.