కందుకూరు, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విజన్‌తో పాలనను అందిచినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పల్లెల్లో ఐదెకరాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రజలకు అందించడానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. కందుకూరు మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో అమెజాన్ కంపెనీ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పార్కు వాకింగ్ ట్రాక్, హెల్త్ సెంటర్, డ్వాక్రా, అంగన్ వాడీ, ఓఆర్ఆర్ ప్లాట్లను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అంగన్ వాడీ పిల్లలతో సరదాగా కాసేపు గడిపిన అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో సాజీ పీకే, ఆదిత్య చౌదరీలతో కలిసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న భవనాలతో పాటు ఇతర అబివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపమోగపడుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అమెజాన్ మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులను చేపట్టినట్లు పలు అభివృద్ధి పనులను గుర్తు చేశారు.
ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూములు కేటాయించిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎకరాకు (గుంట) 121 గజాలను కేటాయించిందని, ఎచ్ఎండీఏ లే అవుట్ కూడా చేసి కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఆ ప్లాట్లపై కొందరు దళారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని, రైతులను మోసం చేసి కారు చౌకగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరు కూడా వారి భ్రమలో పడి పొరపాటుగా అమ్ముకొవద్దని కోరారు. ఈ ప్రాంతానికి ఉజ్జ్వల భవిష్యత్ ఉందని, బంగారం, కన్నా భూములకు ఎక్కువ ధర పలుకుందని తెలిపారు.
మీర్ఖాన్ పేట్ గ్రామంలో గాలి పటాలు, పతంగులను సబితా ఇంద్రారెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అమెజాన్ సెంటర్ ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన ఆమె పంతంగులు ఎగుర వేస్తున్న చిన్న పిల్లల వద్దకు వెళ్లి, కాసేపు పతంగులను ఎగుర వేసి వారితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు పట్టలేని సంతోషం కలిగింది.
గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారితో పాటు పంచాయతీ కార్యదర్శిలపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తుంటే వారికి తమషాగా ఉందా? అంటూ ఆగ్రహం వక్తం చేశారు. గ్రామంలో ఉండకుండా ఎక్కడికి వెళ్లారు? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరు నారాయణరెడ్డికి తాను, ఎంపీడీఓ ఫిర్యాదు చేయాలని స్థానిక నాయకులకు తెలిపారు. బాధ్యతలను చులకనగా చూడటం, తాను వస్తుంటే విధులకు ఎందుకు డుమ్మాకొట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బ్రహ్మణపల్లి జ్యోతి శేఖర్ గుప్తా, మాజీ ఎంపీటీ కాకి రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, డైరెక్టరు ఆనంద్, మాజీ సర్పంచ్ జంగయ్య, మాజీ డైరెక్టరు దేవీలాల్ నాయక్, నాయకులు సురుసాని కొండల్ రెడ్డి, బర్కం వెంకటేశ్, సురుసాని సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, టంకరి ఉమాకాంత్ రెడ్డి, నవీన్ అమెజాన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.