
శేరిలింగంపల్లి, జూన్ 28 : ఎన్నో ఏండ్ల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. మసీదుబండా నుంచి జేవీజీ హిల్స్ వరకు ప్రభుత్వం నూతనంగా నిర్మించిన లింకురోడ్డు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో కలిసి సోమవారం లింకురోడ్డును ప్రారంభించారు. జేవీజీ హిల్స్ జంక్షన్ మొదలుకొని ప్రభుపాద లేఅవుట్ మీదుగా మసీదుబండా మీదుగా సెంట్రల్ యూనివర్సిటీ బస్‌డిపో రోడ్డు వరకు దాదాపు కిలోమీటరు మేరకు హెటెన్షన్ లైన్ కింద భాగంలో రూ. 7.57 కోట్ల వ్యయంతో లింక్‌రోడ్డును నిర్మించింది.
దీంతో ప్రభుపాద లేఅవుట్ కాలనీ, జేవీజీ హిల్స్, రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీ, కొండాపూర్, మసీదుబండా, లింగంపల్లి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం ఎంతో సులభతరం అయింది. ఒకప్పుడు గుంతలమయంగా, ఇరుకురోడ్డుగా ఉన్న ఈ రహదారి నేడు 150 అడుగుల మేరకు విస్తరణతో విశాలంగా మారింది.బోటనికల్ గార్డెన్ నుంచి మసీదుబండా గ్రామం మీదుగా అందుబాటులో ఉన్న ప్రస్తుత ప్రధాన రోడ్డుకు ఇది ప్రత్యామ్నాయ రహదారిగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణించేందుకు ఎంతోగానో తోడ్పడుతుంది. లింకురోడ్డు అందుబాటులోకి రావడంతో మసీదుబండా, కొండాపూర్ పరిసర ప్రాంతాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.