మియాపూర్ , సెప్టెంబరు 6 : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత, నిస్పాక్షితను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అర్హులకే డబుల్ ఇండ్లు కేటాయించేల అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రగతి సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ అమేయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ , మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్‌రెడ్డితో పాటు సహచర ఎమ్మెల్యేలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గుల్ మోహర్ కాలనీ, సాయినగర్ ప్రాంతాలలో డబుల్ ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని , నిజమైన లబ్ధిదారులకు కేటాయించేలా చూడాలన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే గృహ నిర్మాణాలలో చోటు చేసుకున్న అక్రమాలను అరికట్టాలని సూచించారు. గతంలో ఈ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి దక్కేలా చూడాలన్నారు. అక్రమ చొరబాటుదార్లను నిలువరించాలని ఆయన కోరారు. విప్ గాంధీ వినతికి స్పందించిన మంత్రి తక్షణమే క్షేత్రస్థాయిలో పరిస్థితిని విచారించి వచ్చే సోమవారం నాటికి నివేదించాలని అధికారులను ఆదేశించినట్లు విప్ గాంధీ తెలిపారు.