Minister Ponnam Prabhakar | సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందరు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గణేష్ పండుగ – 2024పై ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు సమావేశం నిర్వహించామన్నారు. విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయే విగ్రహాల వరకు రూట్లలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
శోభాయాత్ర జరిగే ప్రాంతాలు, రహదారులపై గుంతలు లేకుండా, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల సహకారం ఉండాలని, బాంబే తర్వాత హైదరాబాద్‌లోనే గణేష్ ఉత్సవాలు ఘనంగా చూస్తామని చెప్పారు. నిమజ్జనం అంశం కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకు పోతామని తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడే ఎన్జీవో సంస్థల ద్వారా లక్షల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జల మండలి ఎండీ అశోక్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వ ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కార్వాన్ కుల్సుంపురా ప్రాథమిక, ఉన్నత పాఠశాలను రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి సదుపాయాలు, పుస్తకాలు అందాయా? బోధన ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి తరగతి గదిలో నేలపై కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. విద్యారంగం బలోపేతానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.1100 కోట్లతో రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ రోహిణి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.