మొయినాబాద్, జూన్ 9 : మూసీనదిని ప్రక్షాళన చేసి సుందరీకరిస్తామని సీఎం ఒకవైపు జపం చేస్తుంటే ..మరోవైపు నగరవాసుల దాహార్తిని తీర్చే గండిపేట జలాశయం కలుషితమయ్యే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే.. గండిపేట జలాశయానికి సమీపంలో గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డును మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, మంజులారవియాదవ్, రావూఫ్లతో కలిసి సబితారెడ్డి సందర్శించి పరిశీలించారు.
క్రీడాప్రాంగణాన్ని చెడగొట్టి డంపింగ్ యార్డుగా మార్చడంపై మండిపడ్డారు. మార్పు అంటే అభివృద్ధిని ధ్వంసం చేయడమేనా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలను పచ్చద నం.. పరిశుభ్రంగా ఉంచాలనే సదుద్దేశంతో పల్లె ప్రకృతివనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాన్ని, నర్సరీని తొలగించి హిమాయత్‌నగర్‌లో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డును ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చెత్తతోపాటు రాత్రి సమయంలో హైదరాబాద్ నగ రం నుంచి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో గుట్టలుగా పేరుకుపోతున్నదన్నారు.
భారీ వర్షాలు కురిస్తే వరద నీరు డంపింగ్ యార్డు నుంచి సమీపంలో ఉన్న గండిపేట జలాశయంలో కలిసే ప్రమాదం ఉందని ఆం దోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉన్నందునా గండిపేట జలా లు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పాలన పడకేసిందని.. పంచాయతీలు, మున్సిపాలిటీలకు సర్కార్ రూపాయీ కేటాయించడంలేదని ఆరోపించా రు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి డంపింగ్ యార్డును ఎత్తివేసి యువతకు క్రీడాప్రాంగణాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు.
నెల రోజుల్లో డంపింగ్ యార్డును హిమాయత్‌నగర్ నుంచి తరలించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీధర్, మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, నాయకులు పరమేశ్, రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, స్వామి, రాజుగౌడ్, దర్శన్, మధు, మల్లేశ్, రమే శ్, కిరణ్, సునీల్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ కిరణ్, ఎండీ అలీమ్, విఠల్, శ్రీనివాస్, దర్శన్, నగేశ్, సలీంఖాన్ పాల్గొన్నారు.