బేగంపేట్, జూన్ 24: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి (లష్కర్) బోనాల జాతరనను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జూలై 13,14వ తేదీల్లో జరుగనున్న బోనాల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం దేవాలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేవాలయం చుట్టు పక్కల అవసరమున్న చోట బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇక్కడ గతంలో పనిచేసి చేసి వెళ్లిపోయిన పోలీస్ ఇన్ స్పెక్టర్లను నియమిస్తే అవగాహన ఉంటుందని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, జాయింట్ కమిషనర్ విక్రంసింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీ రష్మి పెరుమాల్, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, జలమండలి జీఎం వినోద్ కుమార్, మహంకాళి దేవాలయం ఈవో మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.