హైదరాబాద్ : భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. మంగళవారం ఆయన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలసి హిమాయత్ సాగర్( Himayat Sagar reservoir) జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గట్టిగా ఒక్క వర్షం పడితే జలాశయం నిండుతుందన్నారు. ఈ నేపథ్యంలో జలాశయం కింద ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి సూచించారు.
ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందుబాటులో ఉంది. భారీ వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా మేరకు 5 వేల కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందనిఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి ప్రజలను కోరారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు.