Minister Ponnam Prabhakar | రవీంద్రభారతి, సెప్టెంబర్ 26: బీసీలకు ఎక్కడ అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, కులగణన జరిగి తీరుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో బలహీన వర్గాల ఫెడరేషన్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
రవీంద్రభారతిలోని మెయిన్ హాల్లో చిట్యాల చాక లి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ప్రభుత్వం గురువారం అధికారికంగా నిర్వహించింది. ఐలమ్మ జయంత్యుత్సవాల ఉత్సవ కమిటీ చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వక్తలుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, బస్వరాజు సారయ్య, ఎంపీ అనిల్ కుమార్ యావ్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ నిజాం నిరకుశ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మనందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సాయుధ పోరాటంలో దిశా నిర్దేశం చేసి యావత్ పీడిత వర్గాలకు అండగా ఉద్యమించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.