హైదరాబాద్: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన శరీరానికి ఎముకలు చాలా ముఖ్యమైనవని, అవి దృఢంగా ఉండేందుకు రోజూ వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఆర్థోపెడిక్ వాక్థాన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 3 కి.మీ, 5 కి.మీ, 7 కి.మీ. వాక్థాన్ను నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు నిర్వహించారు. ఇందులో యువతతోపాటు వివిధ వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. ఆర్థోపెటిక్ వాక్ థాన్ అవగాహన వాక్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.
ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని చెప్పారు. ప్రజలు తమ జీవితంలో రోజు వారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు. భవిష్యత్లో ఇలాంటి అవగాహన వాక్ థాన్స్ నిర్వహించాలి, అందుకు ప్రభుత్వం అని విధాలా సహకరిస్తుందని చెప్పారు. వైద్యరంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.