Minister Ponnam Prabhakar | సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. కులవృత్తులే కీలకం. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలి.. అప్పుడే అందరికీ ఉపాధి దొరుకుతుంది.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘మట్టి గణపతి-మహాగణపతి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలు వినియోగించడం వల్ల కులవృత్తులు బాగుపడుతాయని చెప్పారు. అనంతరం 2వేల మట్టి విగ్రహాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరివన్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఆశన్న, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.