హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదలు గ్రేటర్ పరిధిలోని పేదలకు జీ ప్లస్ 3 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మురికివాడల్లో నివసిస్తున్న పేదలు జీవనోపాధి దెబ్బతింటుందనే భయంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదని, అందుకే వారు ప్రస్తుతముంటున్న ప్రాంతంలోనే ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
మంగళవారం మంత్రి.. జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆయా మురికివాడలు ఉన్న ప్రాంతాల్లో స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలే కాకుండా పేదల ఆధీనంలో ఉన్న ప్రైవేటు స్థలాలు, కబ్జాలకు గురైన స్థలాలను కూడా గుర్తించాలని కోరారు. అలాగే, భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించే వీలున్నందున వాటిని కూడా గుర్తించి సాధ్యమైనంత తొందరలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 166 మురికివాడల్లో 42,432 మంది నివసిస్తున్నట్లు, ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్‌లో 12, రంగారెడ్డిలో 26 మురికివాడల్లో సర్వే నిర్వహించి 25,501 మంది కచ్చా ఇళ్లలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. మొత్తం మురికివాడల్లో ఎంత స్థలం ఉంది, ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చో అనే అంశాలపై మరింత అధ్యయనంచేసి నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో జనాభా అనుగుణంగా అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు.
మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలు వెళ్లక పోవడం వల్ల 30వేల వరకూ ఖాళీగా ఉన్నాయన్నారు. ఇళ్ల పట్టాలు పొంది ఇళ్లను ఆక్యుపై చేసుకోని లబ్దిదారులకు నోటీసులు జారీచేయనున్నట్లు చెప్పారు.
అలాగే, నిర్మాణాలు అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా పూర్తిచేయడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి ఆగస్టు చివరిలోగా పంపిణీకి అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్‌ను ప్రారంభించారు.