మేడ్చల్, మే 30 (నమస్తే తెలంగాణ): అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి వ్యవసాయాధికారులతో జూన్ 3న జరిగే రైతు దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు వేదికలను మామిడి తోరణాలు, పూలతో అలంకరించాలన్నారు.
ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్లు, బండ్లపై తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, డీసీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, వ్యవసాయశాఖ అధికారులు మేరీ రేఖ, డీసీవో శ్రీనివాస్ రావు, ఉద్యాన శాఖ అధికారి నీరజ గాంధీ, వెంకట్రాంరెడ్డి, ఏవోలు మార్కెట్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.