శామీర్‌పేట, నవంబర్ 15 : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేటలో బుధవారం మేడ్చల్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి ఆశీర్వాద సభ నిర్వహించారు. సభలో గొల్లకురుమ, వడ్డెర, యాదవ, గౌడ సంఘాలు పెద్ద ఎత్తున సభకు హాజరై మంత్రిని సన్మానించారు. ముందుగా వివిధ పార్టీల నుంచి కార్యకర్తలకు గులాబీ కండువాకప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శం అన్నారు. గోదావరి, కృష్ణ జలాలతో తెలంగాణ ప్రాంతానికి తాగునీరు, సాగునీటిని అందించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ పథకం ఎంత గొప్పదో ఒక్కసారి మహిళలు అడిగితే తెలుస్తుందన్నారు. ఆడపిల్లలకు మేనమామలాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, రైతన్నకు వెన్నుదన్నుగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని 5 మండలాలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యాన్ని పెంచారన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో 125 ఆలయాలు నిర్మించినట్లు, కుల సంఘాల బలోపేతానికి కృషి చేసినట్లు వివరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, సర్పంచ్ బాలమణి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్లు మాధవి, విజయలక్ష్మి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, మేడి రవి, లాలయ్య, సోనీ, అఫ్జల్ఖాన్, వెంకట్‌రెడ్డి, మురళి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.