Minister Mallareddy | మేడ్చల్, జూలై 21(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోమారు గెలిపించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లను గల్లం తు చేసి ఇరు పార్టీల అడ్రస్‌లను ప్రజలు తుడిచి పెట్టనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఘంటా పదంగా చెప్పారు. జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధే కనుపడుతున్నదని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్న బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో ప్రజలే గెలిపిస్తారన్నారు. ఎంపీగా మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధినే పట్టించుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేక రేవంత్ ముఖం చాటేశాడని అన్నారు. ఐదు మండలాలయూత్ అధ్యక్షుడిగా నీరజ్ గౌడ్
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఐదు మండలాల యూత్ అధ్యక్షుడిగా నీరజ్ గౌడ్‌ను నియమించారు. ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, దుర్గం వినయ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విజయ్ ముదిరాజ్, సహాయ కార్యదర్శిగా సంతోష్‌రెడ్డిలను నియమించి పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు వారిని అభినందించారు.
దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నది
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన తీరును చూసి దేశంలోని నాయకులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారని జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు అన్నారు. అన్ని వర్గాల వారీకి సంక్షేమ పథకాలను అందిస్తూ, ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ కీలకం కానున్నదన్నారు. అందుకు ఉదాహరణే ‘దేశంలోని వివిధ రాష్ర్టాల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం’గా పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు కీలకం కార్యకర్తలేనని, పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారిని అధిష్టానం తప్పక గుర్తిస్తున్నదని, అందుకు నిదర్శనం తనేనని శంభీపూర్ రాజు చెప్పారు. కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, గంథ్రాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, డీసీఎంఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ భద్రారెడ్డి, పార్టీల మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, సుదర్శన్, మల్లేశ్ గౌడ్, రమేశ్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.