బోడుప్పల్, అక్టోబర్14: తెలంగాణ కార్మికులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులను కన్నబిడ్డల లెక్క కడుపులో పెట్టుకొని చూసుకున్నారని తెలిపారు. శనివారం బోడుప్పల్‌లోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రింగ్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో మరిన్ని బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కనివినీ ఎరుగని అభివృద్ధితో కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నదని, అందుకే వివిధ రాష్ర్టాల కార్మికులు తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించిన తరువాత ఆత్మగౌరవం నిలిపేవిధంగా భవన నిర్మాణం చేసుకుందామని చెప్పారు.
యాభైఆరేండ్లు సుధీర్ఘంగా దేశాన్ని పాలించి వారానికోసారి పవర్‌హాలీడే ప్రకటించి పనిలేకుండా చేసి కార్మికుల పొట్టగొట్టిన కాంగ్రెస్‌కు ఓటేయొద్దని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా దశాబ్దం పాటు ప్రజల మన్ననలను చూరగొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కార్మికులను కోరారు. కార్మికుల కష్ట, సుఖాలు తెలిసిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి అని పేర్కొన్నారు. కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండాలని, సంక్షేమ ప్రభుత్వాన్ని ఓటుద్వారా మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు చందర్‌గౌడ్, పద్మారెడ్డి, చీరాల నర్సింహ, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, నాయకులు బొమ్మక్ బాలయ్య, కొత్త రవి, గుర్రాల వెంకటేశ్‌యాదవ్, మోతెరాజు,శత్రజ్ఞ, పాండురంగ, రాసాల మహేశ్, సెంట్రింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పరుశురాం, హరియాదవ్, వీరాస్వామి, మల్లేశ్, వెంకట్‌రెడ్డి, ప్రతాప్, శ్రీకాంత్‌యాదవ్, శ్యామ్, యాదగిరి, శ్రీరాములు, స్వామి, శ్రీనివాస్, రవియాదవ్, యాకూబ్ పాల్గొన్నారు.