మేడ్చల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం తూంకుంటలోని జెన్వీ ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసేందుకు ప్రజలు సిద్ధమతున్నారని అన్నారు. రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడిందన్నారు. మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధి తీరును చూసి దేశ ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేశాన్ని తాకట్టు పెడుతున్న మోదీ
ప్రధాని మోదీ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. సమావేశంలో ముందుగా 15 అంశాలతో కూడిన తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశ్, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మేకల కావ్య, మున్సిపల్ చైర్మన్లు ప్రణిత, చంద్రారెడ్డి, దీపిక, పావని, రాజేశ్వర్‌రావు, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, పార్టీ ప్రతినిధులు దయానంద్ యాదవ్, సుదర్షన్, శ్రీనివాస్‌గౌడ్, సంజీవ, శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, రమేశ్, కొండల్ ముదిరాజ్, శేఖర్‌గౌడ్, శ్రీధర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మల్లారెడ్డిని గెలిపించుకుని..కేసీఆర్ రుణం తీర్చుకుంటాం
తెలంగాణ ప్రజల అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్‌లు ఏమీ చేసిండ్రు. అదే కేసీఆర్ 9 ఏండ్లలో ఎంతో అభివృద్ధి చేసిండు. నిన్న మొన్న కష్టపడి పేదలు కట్టుకున్న ఇండ్లకు పట్టాలను కూడ కేసీఆర్ సార్ ఇప్పించిండు. ఎన్నో ఎండ్ల నుంచి పట్టాల కోసం ఎదురు చూసినా కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు పట్టించుకోలేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్‌కిట్, రైతుబీమా, రైతుబంధు, పింఛన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుండు. అన్ని పథకాలతో ఎంతో బాగుపడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి మల్లారెడ్డి ప్రజల కోసం పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రుణం తీర్చుకుంటాం.
– కేతమ్మ, మాజీ వార్డు సభ్యురాలు, జవహర్‌నగర్