మేడ్చల్ రూరల్, అక్టోబర్ 30: నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నవంబర్ 30న మనందరి వేలుకు ఇంకు, డిసెంబర్ 3న తెలంగాణంతా పింకు అంటూ తనదైన శైలిలో కార్యకర్తల్లో జోష్ నింపారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశం సోమవారం కండ్లకోయలోని నిమ్మల గార్డెన్లో ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను పదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. సీఎం పాలనలో సాగు, తాగు నీరు, కరంట్, వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లినప్పడు అభివృద్ధి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. గెలిచిన నాటి నుంచి ఏనాడు నియోజకవర్గానికి రాలేదని, అలాంటి వ్యక్తి నేడు కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రేవంత్‌రెడ్డిది బ్లాక్మెయిల్ చరిత్ర అని, ఆయన సీఎం అవుతానంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరన్నారు.
కాంగ్రెస్ అంటే ఓ దరిద్రం…
కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని, కరెంట్, పింఛన్లు ఇవ్వలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాడు పింఛన్లు కేవలం రెండు వందలు మాత్రమే ఇచ్చేవారని, అది కూడా ఒకరు చనిపోతేనే మరొక్కరికి వచ్చేవన్నారు. కాని నేడు బీఆర్ఎస్ హయం లో ఆసరా పింఛన్లు రెండు వేలు వస్తున్నాయని, వచ్చే జనవరి తర్వాత మూడు వేలు వస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి..
ఘట్కేసర్: బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించి, ఆర్జీకేలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి సీఎం కేసీఆర్‌ను మరోసారి బలపర్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.