కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11: ఇప్పటికే రూ.200 కోట్ల వ్యయంతో కుత్బుల్లాపూర్‌లో చేస్తున్న ఎస్ఎన్డీపీ పనులకు మరో రూ.10 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కేపీ మంత్రి కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం అసెంబ్లీలో ఎస్ఎన్డీపీ పనులపై జరిగిన చర్చలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడారు. గ్రేటర్లో ఎస్ఎన్డీపీ పనులకు రూ.985 కోట్లు కేటాయించగా.. ఇందులో సుమారు రూ.200 కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు నాలాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
పెరిగిన ఖర్చుల నేపథ్యంలో 15 నుంచి 20 శాతం పనులు పూర్తి కాలేదని.. మరో రూ.10 కోట్లు మంజూరు చేస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా ఏర్పాటైన కొంపల్లి, పీర్జాదిగూడ, బడంగ్పేట్, ఇతర స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయాలని.. అంతేకాక నాలాలను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ రికార్డుల్లో పొందుపరిస్తే కబ్జాలకు తావుండదని వివరించారు. దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్ అదనంగా కావాల్సిన రూ.10 కోట్లను మంజూరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నాయీ బ్రాహ్మణుల పాలాభిషేకం..
అసెంబ్లీ సాక్షిగా నాయీబ్రాహ్మణుల సమస్యలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద లేవనెత్తగా.. నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం చింతల్‌లోని క్యాంపు కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేపీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రేణయ్య, ప్రధాన కార్యదర్శి పరమేశ్, గౌరవ అధ్యక్షుడు యాదగిరి, సలహాదారులు భిక్షపతి, శివకుమార్, ఉపాధ్యక్షుడు మహేశ్‌తో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.