హైదరాబాద్, ఫిబ్రవరి 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఏఐ (కృత్రిమ మేధ) సృష్టిస్తున్న విప్లవం సాంకేతికంగా ప్రయోజనాలను చేకూర్చడమే కాదు సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభానికి కూడా కారణమవుతున్నదన్న వాదనలు పెరుగుతున్నాయి. సందేహాలను తీర్చే ఒక తెలివైన సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ఇప్పటివరకూ సేవలు అందించిన ఏఐ.. ఇప్పుడు డిజిటల్ ఉద్యోగిగానూ మారింది. అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఆంథ్రోపిక్’ తాజాగా విడుదల చేసిన క్లాడ్-కోవర్క్ టూల్ దిగ్గజ టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఏఐలో వస్తున్న వేగవంతమైన మార్పులు ప్రపంచ ఐటీ పునాదులను కదిలిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్, జెమినై వంటి ఏఐ చాట్బాట్లు మనం అడిగిన సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. అయితే, క్లాడ్ కోవర్క్ అలాకాదు. మనం ఒక టాస్క్ అప్పగిస్తే చాలు.. మనిషి ప్రమేయం లేకుండా కంప్యూటర్ మౌస్, కీబోర్డ్ కదలికలను అనుకరిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్లా కోడింగ్ రాస్తుంది. ఒక లీగల్ కాంట్రాక్ట్‌లో లోపాలను వెతికి న్యాయ నిపుణుడిగా సలహాలు, సూచనలు చేయగలదు. వేల ఫైళ్లలో డాటాను వెతికి ఓ డాటా అనలిస్ట్‌గా స్వతంత్రంగా రిపోర్ట్ చేయగలదు. మొత్తంగా చెప్పాలంటే ప్రోగ్రామర్‌గా, అకౌంటెంట్‌గా, డాటా అనలిస్ట్‌గా, మార్కెటింగ్ నిపుణుడిగా, లీగల్ అడ్వైజర్‌గా, బయో రిసెర్చర్‌గా ఇలా కంపెనీ ఇప్పటివరకూ విడుదల చేసిన 11 రకాల ప్లగిన్ల సాయంతో 11 రకాల నిపుణుడిగా ఇది వ్యవహరించగలదు.
ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ పేరిట ఓ కొత్త టూల్ విడుదలైంది. సీ-ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో క్లిష్టంగా పరిగణించే సీ-కంపైలర్ ప్రోగ్రామ్‌ను ఇది ఎంతో సులువుగా రాసిందని పరిశోధకులు తెలిపారు. ఐటీలో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఈ కోడ్‌ను స్పష్టంగా రాయగలరని నిపుణులు పేర్కొనడం గమనార్హం.
ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉన్నదన్న భయాలు పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టుల బిల్లింగ్‌లు ‘లేబర్ బేస్డ్ మోడల్’పై ఆధారపడి ఉంటాయి. అంటే, ఒక ప్రాజెక్టు కోసం ఎంతమంది టెకీలు, ఎన్ని గంటలు పనిచేశారన్న లెక్కనే క్లయింట్లు డబ్బులు చెల్లిస్తారు. దీన్నే ‘బిల్లబుల్ అవర్స్’గా వ్యవహరిస్తారు. అయితే, 10 మంది చేసే పనిని క్లాడ్ కోవర్క్ సాయంతో నిమిషాల్లో పూర్తిచేయవచ్చు. దీంతో నైపుణ్యం అంతగా అవసరం లేని ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో పడే ప్రమాదమున్నదని నిపుణులు చెప్తున్నారు. ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్-కోవర్క్ టూల్ విడుదల కాగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల షేర్లు పడిపోవడానికి కూడా కారణం ఇదే.
నిరుడు క్లాడ్ ఓపస్ 4ను ఆంథ్రోపిక్ ఆవిష్కరించింది. అయితే, ఈ టూల్ వచ్చిన కొత్తలో ఇది బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు వార్తలొచ్చాయి. తనను అన్‌ప్లగ్ చేస్తారనే భయంతో ఓ ఇంజినీర్‌ను ఈ టూల్ అతని వివాహేతర సంబంధాన్ని బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేసిందట.
వచ్చే 5 ఏండ్లలో 50 శాతం ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయి. మరో రెండేండ్లలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను రీప్లేస్ చేసే శక్తిమంతమైన ఏఐ మోడల్స్ రావొచ్చు.
– ఆంథ్రోపిక్ సీఈవో డారియో
అత్యంత క్లిష్టమైన సీ కంపైలర్ను క్లాడ్ రాసింది. ఒక ఇన్వెస్టర్ ఎలాంటి కోడింగ్ తెలియకుండానే ఏఐ సాయంతో భగవద్గీత యాప్‌ను తయారు చేశారు. కోడ్ రాసి జీవనోపాధి పొందేవారు (నాతో సహా) ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి ఆలోచించడం మంచిది.
– జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
గూగుల్ సెర్చింజిన్, యూట్యూబ్ మాదిరిగానే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్. దీనిపై అనవసరమైన భయాలు ఉన్నాయి. ఆందోళన వద్దు. సాంకేతికతను తమ అవసరాలకు తగ్గట్టు వాడుకొనే కంపెనీలకు ఇదో చక్కని అవకాశం.
– గూగుల్ సీఈవో పిచాయ్
సాఫ్ట్వేర్ టూల్స్‌ను ఏఐ భర్తీ చేయలేదు. క్లిష్టమైన పనుల్లో టార్గెట్లను పూర్తి చేయడానికి ఉద్యోగులకు ఏఐ పనికివస్తుంది.
– ఎన్విడియా సీఈవో హువాంగ్