సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) ;దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇది దేశంలోనే కాక అంతర్జాతీయ వ్యాప్తంగా వినిపిస్తున్న వాస్తవం. వేల కోట్ల విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షిస్తూ ముందడుగేస్తున్న విజయ గాధ నేడు తెలంగాణ సొంతమైన కధనం చూస్తున్నాం. ప్రజలనే దేవుళ్లుగా భావించి, వారి శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలను వారికి చేరువ చేసింది. తెలంగాణ ప్రగతి ఫలాలను ప్రజలకు అందిస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని సైతం అందించే లక్ష్యంతో రాష్ట్రంలో తొమ్మిది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను శుక్రవారం ప్రారంభించి, వైద్య రంగంలోనే మునుపెన్నడూ సాధ్యం కాని బృహత్తరమైన విప్లవాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యార్థులకు అందని ద్రాక్షగా తయారైన మెడికల్ సీట్లను 85% స్థానికులకే వచ్చేలా ప్రభుత్వం చేరువ చేసింది. దేశంలోనే అత్యధికంగా మెడికల్ కళాశాలలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను మన సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రం నేడు పురోగమిస్తున్నది. అందులో భాగంగానే శుక్రవారం ఏక కాలంలోనే తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా తరగతులను ప్రారంభించుకున్నాం. పలు మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయ శంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం అసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలలో పలువురు మంత్రులు ప్రారంభించారు. ఆయా జిల్లాలలో మంత్రులు భారీ ఎత్తున విద్యార్థులు, స్థానికులతో కూడిన ర్యాలీలు, సభలు నిర్వహించారు.