Bansilalpet Metla Bavi | హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా బావిని పునరుద్ధరించారు. ఈ బావిని 3 శతాబ్దాల క్రితం నిర్మించారు. సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ బావిని జీహెచ్ఎంసీ పునరుద్ధరించింది. పురాతన బావికి మరమ్మతులు చేసి ఆధునీకరించారు. దీంతో మెట్ల బావి కొత్త అందాలు సంతరించుకుంది. అనాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కార్యాచరణ చేపట్టారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే మెట్ల బావుల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టి.. ‘బావి’తరాలకు అందించేందుకు నడుం బిగించింది. ఇందులోభాగంగానే బల్దియా, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో బన్సీలాల్‌పేట మెట్ల బావి మళ్లీ జీవం పోసుకుంది. చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టు 15న ప్రారంభించారు. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. కండ్లు చెదిరేలా పర్యాటక హంగులు కల్పించారు. విద్యుద్దీపాలు అలంకరించి.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, పూడికతీత తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీ, చక్కటి పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.