చదివింది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్టీ. ఫస్ట్ క్లాస్‌లో పాస్. అయినా ఏం లాభం. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దానికి తోడు.. భర్తకు అనారోగ్యం. ఇద్దరు కూతుళ్లు, భర్తను పోషించే భారం తనపై పడింది. దీంతో తప్పని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ స్వీపర్‌గా చేరాల్సి వచ్చింది.
గత ఆరునెలలుగా జీహెచ్ఎంసీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజని ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు కరోనా మహమ్మారి వల్ల ఏ ఉద్యోగం దొరకలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో రజని స్వీపర్‌గా పనిచేస్తున్నారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఆ మహిళకు జీహెచ్ఎంసీ ఆఫీసులో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఉద్యోగం ఇప్పించారు.
ఐఏఎస్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి రజని.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రజని పరిస్థితిని మంత్రి కేటీఆర్‌కు.. అరవింద్ కుమార్ వివరించారు.
వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి.. తన క్వాలిఫికేషన్‌ను వెరిఫై చేయించి.. అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఆఫర్ లెటర్‌ను ఇప్పించారు. దీంతో రజని భావోద్వేగానికి గురయింది. మంత్రి కేటీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మంత్రి కేటీఆర్ తనను ఓదార్చి.. తనకు మంచి భవిష్యత్తు ఉందని.. చదువు ఎప్పుడూ తలవంచుకునేలా చేయదని రజనికి ధైర్యం చెప్పారు.
దీనికి సంబంధించిన అరవింద్ కుమార్ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేసి.. ఈరోజు నా బిజీ షెడ్యూల్లో బెస్ట్ మూమెంట్ ఇదే.. ఆల్ ది బెస్ట్ రజని గారు.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. ఆ మహిళ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించినందుకు మెచ్చుకుంటున్నారు. ఈ పనితో మీ మీద ఇంకా గౌరవం పెరిగింది కేటీఆర్ గారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Best moment of my hectic day today 😊
— KTR (@KTRTRS) September 20, 2021
All the very best Rajni Garu in your new role 👍 https://t.co/xHWqetXHeT