అలనాటి అసమర్థ, చేతకాని కాంగ్రెస్ పాలన వల్ల ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవ చేశారు. ప్రస్తుతం మేడ్చల్ ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. ఎంపీగా ఎన్నడూ ఈ నియోజకవర్గంలో పర్యటించింది లేదని, ఇక్కడి ప్రజలను ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి.. ఇప్పుడు ఓట్లు ఏ విధంగా అడుగుతారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2000 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందని తెలిపారు. మెట్రో రైలు, స్కైవాక్, శిల్పారామం, ఐటీ పార్కుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక వాడలు, రోడ్ల వెడల్పు, పరిశ్రమలకు కావాల్సినంత కరెంట్ సౌకర్యం.. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)/ మల్లాపూర్ : తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్, మంచినీరు ఇలా అనేక సమస్యలను తీర్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. సభా వేదికపై ఇరువైపులా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మీ ఉత్సాహం, ఊపు చూస్తుంటే.. ఉప్పల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి, సకాలంలో అందుతున్న సంక్షేమ పథకాలు, తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అభివృద్ధి కోసం ఏం చేస్తుందనేది విస్త్రత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తొమ్మిదన్నర ఏండ్లలో ఏం చేశాం.. తిరిగి మూడో సారి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనే అంశాలపై బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి పోయి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ సభ్యుడు వంద మంది ఓటర్లు.. అంటే కేవలం 25 ఇండ్లకు పోయి ప్రచారం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలుపించుకోవడం కోసం కార్యకర్తలు, బూత్ సభ్యులంతా పని చేయాలన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో రెండు వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత పాలకుల హాయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.., తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదన్నర ఏండ్ల పాలనలో ఉప్పల్ చౌరస్తాలో స్కైవే, రోడ్ల విస్తరణ, శిల్పారామంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారని, 50 ఏండ్లు పాలించి అప్పుడు ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడు చేసి చూపిస్తామంటే ప్రజలు నమ్ముతారా.. అని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మాటల గారడి రేవంత్‌రెడ్డి.. ఇంతవరకు ఎక్కడ అభివృద్ధి చేయలేదని, పార్లమెంట్లో ఎన్నడూ మల్కాజిగిరి పార్లమెంట్ గురించి నోరు ఎత్తలేదని చెప్పారు. అలాంటి నిన్ను ప్రజలు ఎలా గెలిపిస్తారనుకుంటున్నావని ప్రశ్నించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో సీసీఎంబీ, ఐఐసీటీ, పారిశ్రామిక వాడలు, నాచారంలో చెప్పులు తయారు చేసే పరిశ్రమలు ఎన్నో ఉన్నాయని, దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదొక మినీ ఇండియా అని ఉప్పల్ నియోజకవర్గం గురించి అభివర్ణించారు. అక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. ఎలాంటి తగాదాలు, గొడవలు లేకుండా అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలు, హిందూ, ముస్లింలు అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో కరెంటు సమస్యకు ఉపశమనం కల్పించడంతో పాటు రోజుకు 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితిని తీసుకువచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈసీఐఎల్ వరకు మెట్రో రైలు విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ 25 రోజులు చాలా కీలకమని, బూత్ కమిటీ సభ్యులంతా ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గెలువడానికి ఈ 25 రోజులు కష్టపడి పని చేస్తే.. గెలిచిన తర్వాత ఐదేండ్లు ఉప్పల్ అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఐదేండ్లు పని చేస్తారన్నారు. పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి ఏర్పాటు చేయడంతో పాటు.. ఈ నియోజక వర్గంలో ఉన్న 407 పోలింగ్ బూత్‌లలో 4980 మంది ఇన్చార్జిలను నియమించడం చాలా సంతోష కరమన్నారు. ఉప్పల్‌లో ఐదు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ తరుపున పోటీలో ఉన్న బండారి గెలుపు కోసం ఇంత మంది కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పని చేయడం కోసం సిద్ధంగా ఉండడం అభినందనీయమన్నారు. ఇదే ఊపుతో నగరంలోని అన్ని నియోజక వర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ నమ్మకంతో ఇచ్చారని, మీరందరూ ఐకమత్యంతో ఉండి క్రమ శిక్షణతో పనిచేసి తనను గెలిపించే విధంగా ఈ 25 రోజులు శ్రమించండి.. నేను 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, బీఆర్ఎస్ మహిళా సోదరీమణులు, 5వేల మంది బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.