KTR | దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ అవుటర్‌లో నిర్మించిన సోలార్ సైక్లింగ్ ట్రాక్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంతో పోల్చితే ప్రజలు సుఖజీవనానికి అలవాటు పడుతున్నారని, ఆదాయం పెరిగే కొద్దీ బండ్లు, కార్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని పెద్ద అపార్ట్మెంట్లలో ఉండేవారికి ఒక ఇంట్లోనే రెండుకార్లు ఉంటున్నాయని తెలిపారు. అలాంటివారికి శారీరక శ్రమ ఏముంటుందని ప్రశ్నించారు.
సైక్లింగ్ ద్వారా ఎంతో వ్యాయామం లభిస్తుందన్నారు. సైక్లింగ్ ట్రాక్‌తో ఎవరికి లాభమని.. ఇక్కడి వారికే ఇది ఉపయోగపడుతుందంటున్నారన్న కేటీఆర్.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేననన్నారు. మున్ముందు మరిన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ రేసులు సైతం ఇక్కడ జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి అధ్యయనం చేసినట్లు తెలిపారు. అక్కడ కొన్ని లోపాలను గురించామని.. వాటిని సరి చేస్తూ హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా.. అవుటర్ రింగ్ రోడ్డులో హెచ్ఎండీఏ ఈ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించింది. హెల్త్ వే కార్యాచరణలో భాగంగా ఈ 23 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయగా.. దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కావడం విశేషం. నార్సింగి-గండిపేట మార్గంలో 4.25 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో హెచ్ఎండీఏ నిర్మించింది. ఈ ట్రాక్‌పై సోలార్ రూఫ్ ఉండడంతో సూర్యుడి కాంతిని ఉపయోగించుకొని.. 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నది. మరో వైపు ట్రాక్ పొడవునా సీసీ కెమెరాలను బిగించారు. ట్రాక్ మధ్యలో ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్స్, తాగునీటి సదుపాయాలు, సైకిల్ రిపేర్ దుకాణాలు, సైకిల్ రెంటల్ స్టోర్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ట్రాక్ పొడవునా రంగురంగుల అందమైన పుష్పాలు కనువిందు చేయనున్నాయి.