తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎన్నో గొప్ప సంస్కరణలు అమలయ్యాయి. ఇప్పుడు మరో మానవీయ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రావిర్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, వెస్ట్‌మారేడ్‌పల్లి హైస్కూల్లో మంత్రి కేటీఆర్, మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి మల్లారెడ్డి, అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, అమీర్‌పేట్ డీకేరోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ జిల్లాలో 1,46,086 మంది విద్యార్థులతో సహా జీహెచ్ఎంసీ పరిధిలో 2,38,808 మంది విద్యార్థులకు ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠాగోపాల్, గాంధీ, కృష్ణారావు, వివేకానంద్, బేతి సుభాష్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బలవర్ధకమైన అల్పాహారంతో భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని, బంగారు తెలంగాణలో పౌష్టికాహార లోపం ఆనవాళ్లను నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఈ పథకానికి శ్రీకారం చుట్టామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం వెస్ట్ మారేడ్‌పల్లిలోని మునగ రామ్మోహన్రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అల్పాహార (సీఎం బ్రేక్‌ఫాస్ట్) పథకం కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులకు వడ్డించడంతో పాటు వారితో కూర్చొని మాట్లాడుతూ అల్పాహారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 868 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో లక్షా 46వేల 86మంది విద్యార్థులకు, జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 1314 పాఠశాలల్లో 2లక్షల 38వేల 808 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్లు వివరించారు. తమిళనాడులో 1 నుంచి 5వరకు మాత్రమే కల్పిస్తున్నారని, కానీ ఇక్కడ మన సీఎం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వివిధ పనులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, రోజువారి కష్టపడే కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
తాను విద్యార్థులతో అల్పాహారం చేస్తున్న సందర్భంలో ఒక విద్యార్థిని మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడుగగా టైలరింగ్ చేస్తున్నారని చెప్పిందని, ఇటువంటి చిన్నారులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు. అల్పాహారంపై ఫీడ్ బ్యాక్ తెలియజేయాలని టీచర్లను, విద్యార్థులను కోరారు. ఈ ప్రాంత ప్రజలు కూడా పరిశీలించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ఉప్పల్‌లోని మన్న ట్రస్ట్ నిర్వాహకురాలు లీల జోసెఫ్ ఆధ్వర్యంలో రోజుకు 2లక్షల భోజనాలు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆమెను అభినందించారు.
శుక్రవారం అల్పాహారం ప్రారంభంలో భాగంగా.. ఇడ్లీ, సాంబార్, పూరి, ఆలుకుర్మా, ఉప్మా, చట్నీ, స్వీట్ కేసరి పదార్థాలను వడ్డించారు. వెస్ట్ మారేడ్‌పల్లి విద్యార్థులు 350 మందితో కలుపుకొని పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులు సుమారు 800లకు పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యాశాఖ అధికారి రోహిణి, జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ కమిషనర్ స్నేహశబరిశ్, ఆర్డీవో రవి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని ఉదయం పూట విద్యార్థులకు అందించడం వల్ల వారు తరగతి గదుల్లో మరింత చురుగ్గా వ్యవహరించే వీలుందన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా టిఫిన్ పెడుతారు. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లో 868 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1,46,086 మంది 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరనున్నది. శుక్రవారం ఉదయం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్, అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి మల్లారెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్, మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు టిఫిన్ వడ్డించారు.
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోదుమ రవ్వ లేదా ఉప్మా చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మా లేదా టమాట బాత్ విత్ సాంబార్
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
గురువారం – చిరుధాన్యాల ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్ సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/అటుకులు/ చిరుధాన్యాల ఇడ్లీ చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడీ చట్నీ
శనివారం – పొంగల్, సాంబార్ లేదా కూరగాయల పొలావ్ పెరుగు చట్నీ/ఆలు కుర్మా
అడ్డగుట్ట, అక్టోబర్ 6:పేద విద్యార్థులకు బాసటగా నిలిచి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు టిఫిన్ వడ్డించి, కొంత మంది విద్యార్థులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, ఇంజినీర్ ఆశాలత, ప్రిన్సిపల్ మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు లింగాని శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులతో పాటు పనులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం అద్భుతం. ఈ ప్రాంతంలో అత్యధికంగా పేదలు ఉంటారు. అల్పాహారం అందజేయడం వల్ల పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రాప్‌అవుట్ కాకుండా దోహదపడుతుంది. ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని రూపొందించిన ముఖ్యమంత్రికి, ఇక్కడికి విచ్చేసి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయి. పూరి, ఆలుకుర్మా, ఉప్మా చట్నీ, స్వీట్ కేసరి తిన్నాను. చాలా బాగున్నయ్. ఇక స్కూల్‌కు డుమ్మా కొట్టాలన్నా.. కొట్టలేం. అంతమంచిగా అల్పాహార పథకంలోని వంటకాలు ఉన్నాయి. ఇంటి వద్ద ఆగమాగం తిని స్కూల్‌కు ఉరుకొచ్చేది. ఇప్పటి నుంచి స్కూల్‌కు వచ్చిన తర్వాత టిఫిన్ చేసి, బాగా చదువుకుంటాం.
ప్రత్యేక తరగతులు ఉన్నప్పుడు తిని రాకపోతే కొంతమంది విద్యార్థులు కండ్లు తిరిగి పడిపోయేవారు. ఇప్పుడు ఇక ఆ పరిస్థితి ఏర్పడదు. మా అమ్మ ఓ దవాఖానలో హౌస్‌కీపింగ్ చేస్తుంది. మా నాన్న సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఎర్లీమార్నింగే వారు వాళ్ల పనులకు వెళ్లాల్సిందే. ఈ పథకం అమలుతో వారి ఇబ్బందులు తొలిగిపోయాయి.
దూరం నుంచి స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. తల్లిదండ్రులకు అలసట లేకుండా ఉంటుంది. ఉదయాన్నే మా పేరెంట్స్ పనులకు వెళ్తుంటారు. ఆ సమయంలో త్వరగా వంట చేయాలంటే ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇప్పుడు ఆ సమస్యలు తప్పినట్టే. ఇక స్కూల్ల్లోనే టిఫిన్, మధ్యాహ్న భోజనం.. ఇంకేముందు చదువుపైనే దృష్టి పెడతాం.