రవీంద్రభారతి, సెప్టెంబర్ 9 : పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని, తెలంగాణ యాసకు, భాషకు జీవం పోసి.. ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన మహనీయుడని పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ నారాయణరావు 110 జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన కాళోజీ జయంతి సందర్భంగా.. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ-మానవతా విలువలు అనే అంశంపై సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా , సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా తెలంగాణ సమాజానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అన్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని, అసమానతలు, దోపిడీ, నిరాదరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యం నింపిందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్థానిక భాషను రాయాలని, ఇతరుల భాషను అనుకరించే బానిస భావన పోవాలన్నారు. ఆయన తపించిన తీరుతో ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం వెల్లివిరిసిందన్నారు. కాళోజీ కవితా సంకలనం, నా గొడవలో ఆయన రాసిన అనేక పద్యాలను ఉటకిస్తూ.. ఆయన కవితాశక్తిని , బావుకతను, పోరాట ప్రతిభను, తెలంగాణ తపనను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అంతటి మహనీయుడు తెలంగాణ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు.70 మంది కవులు పాల్గొని తమ కవితలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, టూరిజం, క్రీడల ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, అందెశ్రీ పాల్గొన్నారు.