పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు
అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాలకు 50 బైక్ అంబులెన్స్‌లు
300 అమ్మఒడి… 30 ఆలనా వాహనాలు ఏర్పాటు
పార్థీవదేహాల తరలింపునకు 50 పరమపద వాహనాలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
వెంగళరావునగర్, మార్చి 30 : ప్రభుత్వ వైద్య సేవల్ని పేదలకు అందుబాటులో తెచ్చామని..రాష్ట్రంలో నిరాటంకంగా..నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఇండస్ ఇండ్ బ్యాంకు సహకారంలో ఏర్పాటు చేసిన అంబులెన్సులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 108కు రెండు అంబులెన్సులను సమకూర్చిన ఇండస్ ఇండ్ బ్యాంక్ మరో 8 ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. అంబులెన్సుల సంఖ్యను 430కు పెంచామని, కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త వాహనాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15 నుంచి 20 నిమిషాల్లోపు అంబులెన్సు సేవలు అందుతున్నాయని..ఈ సమయాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. తక్షణ వైద్య సాయాన్ని అందించేలా ఈ అంబులెన్సుల్లో బేసిక్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థ ఉండగా..అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి చేరేలోగా ప్రాణాలు కాపాడే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టెడ్ సిస్టమ్ కలిగిన అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు.
ఏప్రిల్ 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాలుగున్నర లక్షల పేద రోగులకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాల్లో సేవలు అందించేందుకు 50 బైక్ అంబులెన్సులను ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 20 అంబులెన్సులు ప్రతినెలా సగటున 750 ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి సేవలు అందిస్తున్నాయని అన్నారు. 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 19 వేల మందికి 50 బైక్ అంబులెన్స్ సేవలు అందాయని.. 2018 నుంచి ఇప్పటి వరకు 300 అమ్మఒడి వాహనాల ద్వారా 38 లక్షల మంది గర్భిణులు సేవలు పొందారని వెల్లడించారు. దవాఖానాల నుంచి సొంతూళ్లకు పార్థీవ దేహాల తరలింపునకు 50 పరమపద వాహనాలను ఏర్పాటు చేశామని..అలాగే 30 ఆలన వాహనాలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ అలుగు వర్షిణి, జీవీకే ఈఎమ్ఆర్ఐ 108 స్టేట్ హెడ్ ఎం.ఖాలీద్, నగర మేనేజర్ శ్రీకాంత్, జాన్ షహీద్, ఇండస్ ఇండ్ బ్యాంకు గవర్నమెంట్ సెక్టార్ జోనల్ హెడ్ సంగీత సింగ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జావెద్ హుస్సేన్, మేనేజర్ కె.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.