మణికొండ, నవంబర్ 26: రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్గౌడ్కి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మణికొండ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మణికొండ మారిందా? లేదా? అన్నారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బంది పడేవారు. అపార్టుమెంట్లలో ఉండే వాళ్లు నీళ్ల ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటోళ్లు అని అన్నారు. కానీ రాష్ట్రం వచ్చాక నల్లా బిల్లు మాఫీ చేసి ఉచితంగా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలో నాలుగు రోజులకు ఒకసారి నల్లా వస్తుందన్నారు. మన దగ్గర కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల ముందు ఖాళీ నీళ్ల బిందెలు పట్టుకొని వచ్చి నిలదీసేవారన్నారు. జలమండలి దగ్గర ధర్నాలు చేసేటోళ్లని గుర్తు చేశారు.
కానీ కేసీఆర్ వచ్చిన తరువాత అసెంబ్లీలో విపక్ష నేతలు కూడా ఏ ఒక్క రోజు నీళ్ల సమస్య గురించి మాట్లాడలేదన్నారు. మారుమూల తండాలు, గూడెలలో గతంలో కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు ఉండేవి, ఏ దుకాణంలో చూసిన జనరేటర్లు ఉండేవి, పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేవి కానీ కేసీఆర్ అందరికి 24 గంటల కరెంటు ఇచ్చిండన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, బెంగళూరులో కరెంటు కోతలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వస్తే కరువు, కర్య్ఫూ రెండు వస్తాయన్నారు. మూడు సార్లు గెలిచిన ప్రకాశ్‌గౌడ్ సాదాసీదాగా ఉంటాడన్నారు. మొత్తం హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే బెంగళూరులో నిరుద్యోగులతో మీటింగ్ పెట్టగలడా అని ఆయన ప్రశ్నించారు. వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు అని మోసం చేసి ఇక్కడ ఏం చేద్దామని వచ్చారన్నారు. కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దని, రిస్క్ వద్దు కారుకు గుద్దు అన్నారు. ప్రకాశ్‌గౌడ్‌ను గెలిపిస్తే 3 నెలల్లో మణికొండకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు కడుతున్నామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ మైనార్టీల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆటోల పిట్నెస్ చార్జీలు రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ప్రతి పక్షాలకు ఢిల్లీలో అధిష్టానం ఉంది, టికెట్లు, నోట్లు అక్కడి నుంచి వస్తాయి, ప్రచారానికి నేతలు కూడా అక్కడి నుంచే వస్తారు కానీ కేసీఆర్ లోకల్ అని అన్నారు.
అభివృద్ధికి కేరాఫ్ రాజేంద్రనగర్: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
అభివృద్ధికి కేరాఫ్‌గా రాజేంద్రనగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నిలిచిందని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ అన్నారు. ఆనాడు చెంతనే రెండు జంట జలాశయాలున్నా… తాగునీటికి నోచుకోని పరిస్థితి నెలకొన్నది. కానీ గడిచిన పదేండ్ల కాలంలో శాశ్వత తాగునీటి సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త తలారి మల్లేశ్, ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, శంషాబాద్ జడ్పీటీసీ తన్విరాజు, వైస్ చైర్మన్ వెంకటేశ్, బండ్లగూడ మున్సిపల్ మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌గౌడ్, సీతారాం, కీర్తిలతాగౌడ్, కార్పొరేటర్, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.