రవీంద్రభారతి, అక్టోబర్7: మాదిగ సమాజాన్ని కించపరిచేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు మాదిగల ఆత్మగౌరం దెబ్బతినే విధంగా ఉన్నాయని, క్షమాపణ చెప్పకుంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వెంటనే పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచాల యాదగిరి, నాయకులు.. చింత బాబు, శ్రీనివాస్, జంబులయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర సాంఘీక సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని మాదిగ మేధావుల ఫోరం మండిపడింది. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆరెపల్లి రాజేందర్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కాసిం, కోశాధికారి రాంబాబు, ఉపాధ్యక్షుడు దర్శనం జాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకే పార్టీలో ఉంటూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను దున్నపోతుతో పోల్చి మాట్లాడటం సరైనది కాదని అన్నారు. పొన్నం వ్యాఖ్యలు యావత్ మాదిగ జాతిని అవమానించినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పొన్నం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు.