సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ‘శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ పోలీసులు ఫెయిలయ్యారు.. ప్రతి పోలీస్ స్టేషన్‌కు మామూళ్లు వస్తున్నాయి.. నేరస్తులను పట్టుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ సామాన్యులపై లాఠీలు ఝళిపిస్తున్నది. గంజాయి, డ్రగ్స్‌ను ఆపాలనుకుంటే ఒక్కరోజులోనే పోలీసులు ఆపేయగలరు.. కానీ ఆ పని చేయడం లేదు’ అంటూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిని కండ్లకు కట్టినట్లు వివరించారు. రాత్రి పది అయ్యిందంటే పేదలు, సామాన్యులు ఉండే చోట పోలీసులు లాఠీలతో కొడుతున్నారని, అదే బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు 12 గంటల వరకు తెరిచి ఉండే బడాబాబుల నిలోఫర్ హోటల్ మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కన్పించడం లేదా? అని ప్రశ్నించారు.
ఆ హోటల్ నుంచి కమిషనరేట్‌కు టీ, కాఫీలు వస్తాయి..పోలీసులే స్వయంగా ఆ హోటల్ యజమానికి అండగా ఉన్నారు’ అంటూ ఆరోపించారు. ‘ఒక ఏసీపీ ర్యాంకు అధికారి నాకు ఫోన్ చేసి.. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చందా అడిగారు. అయితే మీకు నెలవారీగా వచ్చే మాముళ్లు తగ్గాయా? వాటితో ఇండ్లు కట్టుకోకుండా పోలీస్‌స్టేషన్ కట్టుకోవచ్చు కదా’ అంటూ చెప్పానంటూ మండిపడ్డారు. తెలంగాణలో 9 శాతం నేరాలు పెరిగాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను గాలికొదిలేశారని, అసలు సామా న్య ప్రజలను కొట్టేందుకు పోలీసులకు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘నేను ఇటీవల రాత్రి ఒక పెండ్లికి వెళ్లి వస్తుంటే కమిషనరేట్ కార్యాలయం ముందు 12 గంటలవుతున్నా.. ఫుల్ జనాలతో నిలోఫర్ హోటల్ నడుస్తున్నది. అదే పేదలు ఉండే ప్రాంతంలో 10 గంటలకే రోడ్లపైకి లాఠీలు పట్టుకొని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వస్తున్నారు’ అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో లాఠీలకు పనిచెబుతూ.. పగటి వేళల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిద్రపోతున్నారని, అందుకే వరుసగా హత్యలు, నేరాలు జరుగుతున్నాయంటూ.. అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు. కరుడుగట్టిన నేరస్తులపై నిఘా ఉంచాల్సిన టాస్క్‌ఫోర్స్.. నేడు ఆ విషయాన్ని మార్చిపోయి.. సామాన్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నదన్నారు. కాల్‌సెంటర్లు, ఐటీ, ఐటీయేతర కార్యాలయంలో రాత్రి పోద్దుపోయే వరకు పనిచేసే ఉద్యోగులు, యువత, సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తూ 10 గంటలకే దుకాణాలు మూసేయిస్తుండటంపై కోర్టులో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్యేతో పాటు తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న తాను అసెంబ్లీలో ఈ విషయంపై లేవనెత్తకుండా నేరుగా కోర్టుకు వెళ్లడం భావ్యం కాదని, అందుకే ఈ విషయంపై ప్రభు త్వం దృష్టికి తీసుకొస్తున్నానన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సామాన్యులకు తాను అండగా ఉంటానని.. దుకాణాలను ఎలా పోలీసులు మూసేస్తారో చూస్తానంటూ హెచ్చరించారు.