సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అక్కడ చూస్తే అచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ సెటప్పే.. అందునా సాఫ్ట్ వేర్ ఆఫీసులుండే హైటెక్ సిటీ కాంప్లెక్స్‌లోనే కంపెనీ.. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పనిచేస్తున్నవాళ్లంతా ఏదో చేస్తున్నట్లు హడావిడి.. అచ్చం నిజమైన కంపెనీగా వెబ్ సైట్ రూపకల్పన.. నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగాలిస్తామంటూ ఎర.. తీరా సీన్ కట్ చేస్తే బిచాణా ఎత్తేశాడు. కంపెనీ షట్టర్లు మూసేశాడు. అందినకాడికి దండుకుని పరారయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘరానా మోసగాడు కలువ భార్గవ్‌ను టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ జోన్ పోలీసులు సోమవారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. చింతల్‌కు చెందిన భార్గవ్ ఎంటెక్ పూర్తి చేసి పలు కంపెనీల్లో హెచ్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీలో నియోజెన్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ పేరుతో ఓ ఫేక్ ఐటి కంపెనీని స్థాపించాడు. కొంత మంది ఉద్యోగులను నియమించుకుని ఆఫీస్ పేరు, సెటప్ అంతా గూగుల్ సెర్చ్‌లో కనిపించేలా క్రియేట్ చేశాడు.
నిరుద్యోగులు ఈ కంపెనీ మంచిదేననుకుని తమ రెజ్యూమె తీసుకుని వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేసి ఆ తర్వాత జాబ్ సెక్యూరిటీ కోసం ఒక్కొక్కరి దగ్గరి నుంచి 1లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత ఫేక్ ఆఫర్, అపాయింట్మెంట్ లెటర్లు, ఐడి కార్డులు బాధితులకు ఇచ్చాడు. నాలుగు నెలల తర్వాత కంపెనీ మూసేసి వసూలు చేసిన సొమ్ముతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ జోన్ పోలీసులు పక్కా సమాచారంతో భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్‌స్టేషన్లలలో నాలుగు కేసులున్నాయని, ఈ కేసుల్లో భార్గవ్ నిందితుడుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి లక్షరూపాయల సొమ్ము, ఐదు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, రెండు ఫేక్ ఐడి కార్డ్స్, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగ యువతీయువకులు ఇటువంటి ఫేక్ కంపెనీల వలలో పడి మోసపోవద్దని పోలీసులు సూచించారు.