మద్దూరు(ధూళిమిట్ట), మే 9: అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది పస్తుతం రైతుల పరిస్థితి. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందిస్తామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. యాసంగి సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలోని 13 గ్రామాల్లో పీఏసీఎస్, 5 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేంద్రాల్లో ప్రారంభం నుంచి ధాన్యం కొనుగోళ్లు మందకోడిగా కొనసాగుతున్నాయి. కొండాపూర్, నర్సాయపల్లి, గాగిళ్లాపూర్ తదితర గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు, ఏఈవోల ధ్రువీకరణ తర్వాత కాంటా పెట్టినప్పటికీ, మిల్లర్లు మాత్రం అనేక సాకులు చెబుతూ లారీల్లోని ధాన్యం దించుకునేందుకు నిరాకరిస్తున్నారు.
ఒకే వేళ మిల్లర్లు లోడ్లను దించుకుంటే లారీకి ముప్పై నుంచి నలభై చొప్పన ధాన్యం బస్తాలు కట్ చేస్తున్నారు. లారీకి సుమారు 12 క్వింటాళ్ల ధాన్యాన్ని కట్ చేస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు తెచ్చిన ధాన్యం ఏ-గ్రేడ్ వచ్చినప్పటికీ బీ- గ్రేడ్గానే పరిగణిస్తూ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. లారీ ఆసోసియేషన్లు సైతం మిల్లర్ల కనుసన్నల్లోనే మెలుగుతూ రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. లారీలు రాక గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతుండంగా మరో వైపు మిల్లర్ల చర్యల వల్ల రైతులు ఆగమవుతున్నారు. మిల్లర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు.