సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్నామని తెలంగాణ సర్కారు వెల్లడించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు ఇస్తున్నట్లు జీవో ఎంఎస్. నంబర్ 196ను శనివారం జారీ చేసింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
అందుకు సంబంధించిన డీపీఆర్‌లను వారం రోజుల కిందటే రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రెండో దశలో 5 మార్గాల్లో మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించే ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 24,269 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అందులో 30 శాతం రూ. 7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా జైకా, ఏబీడీ,ఎన్డీబీ సంస్థల నుంచి 48 శాతం చొప్పున అప్పుగా రూ.11,693 కోట్లు, మిగతా 4 శాతమైన రూ.1033 కోట్లను పీపీపీ విధానంలో వెచ్చించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి.
కారిడార్-9గా ఫోర్త్ సిటీ మెట్రో..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా కొంగరకలాన్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ దూరంతో నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. కారిడార్-9గా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ మెట్రో మార్గానికి సైతం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి అలైన్మెంట్, ఇతర ఫీచర్లు, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై మెట్రో అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారని జీవోలో పేర్కొన్నారు.
మొదటి దశకు విశేష ఆదరణ
మెట్రో మొదటి దశకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ ఉందని, ప్రతి రోజూ 5లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. మొదటి దశకు అనుసంధానంగా మరో 6 కారిడార్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి దశ మెట్రోను పూర్తిగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో రూ. 22వేల కోట్ల వ్యయంతో నిర్మించగా, ఇది ప్రపంచంలో అతి పెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్టుగా నిలిచింది. నగరంలో వాయు కాలుష్యం నివారించడంతో పాటు అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా మెట్రో రైలు అవసరమని గుర్తించి రెండోదశను మొత్తం 116.4 కి.మీ మేర నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పార్ట్-ఏలో 76.4 కి.మీ, పార్ట్-బీలో 40 కి.మీ దూరంతో రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వెళ్లనున్నదని జీవోలో పేర్కొన్నారు.
రెండో దశలో నిర్మించే మెట్రో మార్గాలు..